Home » Home and Career » పచ్చిమిర్చి, కొత్తి మీర.. ఇలా స్టోర్ చేయండి.. నెలరోజుల వరకు పాడవకుండా తాజాగా ఉంటాయ్..!

కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వంటగదిలో దాదాపు ప్రతిరోజూ వాడేవే. అయితే, వాటిని సరిగ్గా నిల్వ చేయకపోతే, అవి కొన్ని రోజుల్లోనే వాడిపోవచ్చు, ఎండిపోవచ్చు లేదా పాడైపోవచ్చు. కొందరు తమ ఇళ్లలో నిల్వ చేసిన తర్వాత పచ్చిమిర్తి, కొత్తిమీరను కుల్లిపోయిందనో లేదా వాడిపోయిందనో.. పదేపదే పడవేస్తూ ఉంటారు. వాటిని ఎంతో జాగ్రత్తగా నిల్వ చేశామని అయినా సరే.. అవి పాడైపోతున్నాయని అంటుంటారు. అలాంటి వారు నిల్వ చేసే పద్దతిని మార్చుకోవాలి. కొన్ని సులభమైన చిట్కాలు కొత్తిమీర, పచ్చిమిరపకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. ఏవేంటో తెలుసుకుంటే..
కొత్తిమీర నిల్వ కు సరైన పద్దతి..
కొత్తిమీరను చాలామంది మార్కెట్ నుండి తీసుకువచ్చాక అదే కవర్ లోనే నిల్వ చేస్తుంటారు. దీనివల్ల అదే కవర్ లో తేమ చేరి, కొన్ని రోజుల్లోనే ఆకులు కుళ్ళిపోతాయి. దీనిని నివారించడానికి సులభమైన మార్గం కొత్తిమీరను మెల్లగా ఆరబెట్టి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. అదనపు తేమను పీల్చుకోవడానికి డబ్బా అడుగున ఒక పొడి పేపర్ టవల్ ఉంచాలి. ఆ తర్వాత కొత్తిమీరను ముద్దగా కాకుండా కాస్త పొడిలాగా అమర్చి, డబ్బాకు మూత పెట్టి, ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఎక్కువ కాలం పచ్చగా, తాజాగా ఉంటుంది.
మరొక పద్దతి..
కొత్తిమీర కాండంలో ఒక చిన్న భాగాన్ని కత్తిరించి, కొద్దిగా నీరు నింపిన గ్లాసులో ఉంచి, దానిపై ఒక ప్లాస్టిక్ కవర్ ను వదులుగా కప్పాలి. దీనివల్ల కాండం తేమగా ఉండి, ఆకులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. అయితే, ఈ పద్ధతిలో ప్రతి రెండు మూడు రోజులకు నీటిని మార్చవలసి ఉంటుంది.
పచ్చిమిర్చి నిల్వ చేసే విధానం..
పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే, ముందుగా వాటి కాడలను తీసివేయాలి. తర్వాత పసుపు కలిపిన నీటితో వాటిని కడిగి, ఆపై శుభ్రమైన నీటితో బాగా కడగాలి. వాటిలో తేమ ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. కాటన్ క్లాత్ తో బాగా తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత మిరపకాయలను ఒక జిప్-లాక్ బ్యాగ్‌లో ఉంచి, తొక్క తీసిన రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను జిప్ లాక్ బ్యాగ్ లో వేసి. బ్యాగ్‌కు క్లోజ్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలు త్వరగా ఎండిపోకుండా లేదా ముడుచుకుపోకుండా ఉంటాయి.
ఇది తెలుసుకోవాలి..
రిఫ్రిజిరేటర్ గాలిలోని తేమను తగ్గిస్తుంది, దీనివల్ల పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వంటివి క్రమంగా తమ తేమను కోల్పోతాయి. వాటికి మూతపెట్టకుండా వదిలేస్తే లేదా వాటిలో నీరు ఉంటే, అవి త్వరగా పాడైపోతాయి. అందువల్ల, వాటిని నిల్వ చేయడానికి ముందు పూర్తిగా ఆరబెట్టడం , సరైన కంటైనర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. ఈ చిట్కాలను పాటించడం ద్వారా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను దాదాపు నెల రోజుల వరకైనా తాజాగా ఉంచుకోవచ్చు.
*రూపశ్రీ.

